ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి వదిలించుకొనే కుట్ర మొదలైంది

•ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడమే వైసీపీ ఆలోచన
•అందులో భాగంగానే వేధింపులు మొదలయ్యాయి
•ఇంటి గడప దాటి సచివాలయానికి వెళ్లని సీఎం కూడా హాజరు గురించి చెబుతున్నాడు

పాఠశాల విద్యను పేదలకు దూరం చేసే కుట్రకు వైసీపీ ప్రభుత్వం తెర తీసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఉపాధ్యాయులను వదిలించుకొని ప్రభుత్వ స్కూల్స్ బైజూస్ లాంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన చేస్తోంది. దీనికి సంస్కరణలు, సాంకేతికత వినియోగం లాంటి ముసుగు వేస్తోంది. శ్రీ జగన్ రెడ్డి గారు పాలనలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఉచిత విద్య, దానిపై చేసే ఖర్చులను తగ్గించాలనే విధానంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులను వేధించే చర్యలకు పాల్పడుతున్నారు. బోధన విధులకు దూరం చేస్తూ అందుకు సంబంధం లేని పనులకు బాధ్యులను చేస్తున్నారు. మరుగు దొడ్ల ఫోటోలు తీయించడం, మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేయడం, కోడి గుడ్ల లెక్కలు రాయడం లాంటివి చేయిస్తూ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు సమయం తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయుల హాజరుకి సంబంధించి ఫేస్ రికగ్నిషన్ యాప్ అని గందరగోళపరుస్తున్నారు. ఇంటి గడప దాటి సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు కూడా ఉపాధ్యాయుల హాజరులో నిమిషం ఆలస్యమైతే ఆబ్సెంట్ అంటూ ఉత్తర్వులు ఇప్పించడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఎప్పుడూ సచివాలయానికి వెళ్లకపోవడం వల్ల అభివృద్ధి పటంలో ఏపీ ఆబ్సెంట్ అయిపోయింది. తమకు దక్కాల్సిన జీతభత్యాల గురించి, ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీపీఎస్ రద్దు గురించి టీచర్లు ప్రశ్నిస్తున్నారు కాబట్టే వారిని ప్రభుత్వం వేధిస్తోంది. బోధనకు దూరం చేసి, హాజరు పేరుతో బలవంతంగా సెలవులు పెట్టించి ప్రజలకు ఉపాధ్యాయులను శత్రువులుగా చూపించాలని వైసీపీ నిర్ణయించుకొంది. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలను మూసివేసే పని మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఉపాధ్యాయులను వేధించి వదిలించుకొని.. విద్యాలయాలను బైజూస్ లాంటి తమకు దగ్గరైన సంస్థలకు అప్పగించే కుట్రతో వైసీపీ ఉంది. ఈ చర్యలను జనసేన పార్టీ ఖండిస్తుంది. ఉపాధ్యాయులకు బోధన విధులకు మాత్రమే పరిమితం చేయాలి. అర్థం లేని యాప్స్, ఫోటోలు తీయడం లాంటి పనులను పక్కనపెట్టాలని శ్రీ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *