నిధుల్లేక నీరసించిన నీటిపారుదల ప్రాజెక్టులు

*మూడేళ్లలో పూర్తయినవి నెల్లూరు, సంగం బ్యారేజిలే
*ప్రాధాన్య క్రమంలో ఉన్న మరో 40 నత్తనడక
* వీటికే దిక్కు లేకుంటే కొత్తగా మరికొన్ని ప్రాధాన్య జాబితాలోకి
* మొత్తం ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ.1,36,000 కోట్లు కావాలి
* మూడేళ్లలో చేసిన ఖర్చు రూ.15,393 కోట్లు మాత్రమే

నీటి పారుదల ప్రాజెక్టుల పనులు పడకేశాయి. 2024 నాటికి 42 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానంటూ ఎన్నికల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో కేవలం 2 ప్రాజెక్టులు మాత్రమే పూర్తి చేశారు. ఇప్పటికే మరో 40 ప్రాజెక్టులు ప్రాధాన్య జాబితాలో ఉండగా కొత్తగా మరికొన్నింటిని ఈ జాబితాలో చేర్చారు. నిధులు విడుదల చేయకుండా కేవలం ప్రాధాన్య జాబితాలో చేర్చడం ద్వారా ఏ మాత్రం ప్రయోజనం ఉండదని సీఎంకు తెలియదా? అసలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అనే అనుమానం వస్తోంది. బడ్జెట్లో మాత్రం భారీ కేటాయింపులు చూపడం, నిధులు విడుదల చేసే విషయంలో మాత్రం శ్రద్ధ చూపకపోవడంపై నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రీతిన ముందుకు సాగితే రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు శాశ్వతంగా పెండింగులో పడే ప్రమాదం ఉంది.
*అడుగు ముందుకు పడలేదు
ప్రభుత్వం గుర్తించిన 42 తొలి ప్రాధాన్య ప్రాజెక్టుల పనులలో 40 ముందుకు సాగడం లేదు. ఇదిలాఉండగా మరికొన్నింటిని ప్రాధాన్య జాబితాలో చేర్చారు. నిధులివ్వకుండా పనులు జరగాలంటే ఎలా సాధ్యం. ప్రతి నెలా నిధులు విడుదల చేస్తే పనులు పరుగులు తీసే అవకాశం ఉంది. అలా కాకుండా కేవలం ప్రాధాన్య జాబితాలో ప్రాజెక్టులను చేర్చడం, తరవాత వాటిని పట్టించుకోకపోవడం అంటే రైతులను మోసం చేయడం కాదా? సరిగ్గా ఏపీలో ఇదే జరుగుతోంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కరవు ప్రాంతాలకు నీటిని అందిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీని తుంగలో తొక్కారు. గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ చిత్తశుద్ది అర్థం అవుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.11,482 కోట్లు ఖర్చు చేయాలని జలవనరుల శాఖ అంచనాలు రూపొందించింది. గడచిన 4 నెలల్లో ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.2,200 కోట్లు మాత్రమే. వీటిలో అధిక భాగం జీతాలు. ఇక ప్రాజెక్టులకు కేటాయించింది అరకొర నిధులే. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో జలవనరుల శాఖలో ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.15,393 కోట్లు మాత్రమే. మొత్తం ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ.1,36,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా. బడ్జెట్లో ప్రభుత్వం చేస్తోన్న కేటాయింపులు, నిధులు విడుదల చేసి చేస్తున్న పనులను పరిశీలిస్తే మరో 5 దశాబ్దాలకు కూడా ప్రాజెక్టులు పూర్తి అయ్యే అవకాశం కనిపించడం లేదు.
*ప్రాధాన్య జాబితాలో మరికొన్ని….
2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా కొన్ని ప్రాజెక్టులను ప్రాధాన్య జాబితాలో చేర్చడంతోపాటు, మరికొన్ని కొత్త ప్రాజెక్టులను రూ.72,458 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. వాటిల్లో కొన్ని టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. రాయలసీమ ఎత్తిపోతల, రాజోలిబండ మళ్లింపు పథకం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఎర్రబల్లి ఎత్తిపోతల, రాజోలి జలాశయం, గాలేరు నగరి రెండో దశ కోడూరు వరకు మళ్లింపు, గాలేరు నగరి హంద్రీనీవా ఎత్తిపోతల పథకాలను తొలి ప్రాధాన్య జాబితాలో చేర్చారు.వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం వద్ద 5 ఎత్తిపోతల పథకాలు, చింతలపూడి ఎత్తిపోతల, వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల కరవు నివారణ పథకం, వరికపూడిశిల ఎత్తిపోతల, జీడిపల్లి కుందుర్పి పథకం, మడకశిర బైపాస్ కాలువ పథకాలను కొత్తగా ప్రాధాన్య జాబితాలో చేర్చారు. కేవలం ప్రాధాన్య జాబితాలో చేర్చి వదిలేశారు. వాటికి నిధులు మాత్రం కేటాయించలేదు. అంటే ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ప్రభుత్వ ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.
*కేవలం 2 ప్రాజెక్టులు పూర్తి చేశారు
గత ఆర్థిక సంవత్సరం అంటే 2020-21లో తక్కువ ఖర్చుతో పూర్తి చేయగల 5 ప్రాజెక్టులను అధికారులు గుర్తించారు. అందులో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలను మాత్రమే పూర్తి చేశారు. అవుకు రెండో టన్నెల్, వంశధార నాగావళి అనుసంధానం, వంశధార రెండో దశ రెండో భాగం పనులు, వెలిగొండ మొదటి టన్నెల్ పూర్తి చేసి నీరివ్వడంలాంటి పనులు ముందుకు సాగడం లేదు. నెల్లూరు బ్యారేజీకి రూ.94కోట్లు, సంగం బ్యారేజీకి రూ.64 కోట్లు నిధులు విడుదల చేస్తే పది నెలల్లో పనులు పూర్తి చేయవచ్చని జగన్ రెడ్డికి సీఎం కాగానే ఇంజనీర్లు చెప్పారు. నిధులు కేటాయించి ఉంటే రెండేళ్ల కిందటే పూర్తి కావాల్సిన నెల్లూరు బ్యారేజీ, సంగం ప్రాజెక్టు పనులు ఎట్టకేలకు అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు పూర్తి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో 42 పెండింగ్ ప్రాజెక్టుల పనులను 2024 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలవరం మినహా ఈ 42 ప్రాజెక్టుల పూర్తికి రూ.24,092 కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల తరవాత అతి కష్టం మీద రెండు ప్రాజెక్టులు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన ప్రాజెక్టుల పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు.
*మాటల ప్రభుత్వం
వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో జలవనరుల శాఖ ద్వారా రూ.15,393 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో పోలవరం ఖర్చు కూడా కలిపి ఉంది. పెండింగులో ఉన్న అన్ని ప్రాజెక్టుల పూర్తికి రూ.54 వేల కోట్లు, కొత్తగా చేపట్టిన, చేపట్టబోయే ప్రాజెక్టులకు రూ.82,000 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.11,482 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అయితే గడచిన 4 మాసాల్లో జీతాలతో కలిపి ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 2,200 కోట్లు మాత్రమే. నిధుల కేటాయింపులు ఇదేవిధంగా కొనసాగితే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయ్యేది ఎప్పటికో ఎవరూ చెప్పలేరు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తికి నిధులు విడుదల చేసి పనులు పరుగులు పెట్టించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *