అటల్‌ టన్నెల్‌లో యాక్సిడెంట్లు

అటల్ టన్నెల్ ప్రారంభించిన 72 గంటల్లో పలు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. లే-మనాలీ మధ్య 46 కి.మీ మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన అటల్ టన్నెల్ ను ఈ నెల 3వ తేదీన ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కొత్త టూరిస్ట్ ప్రాంతంగా ఈ టన్నెల్ మారింది. ఈ టన్నెల్ ప్రారంభమైన మూడు రోజుల్లో మూడు ప్రమాదాలు నెలకొందని ఓ వార్తా పత్రిక తెలిపింది.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) జిల్లా అధికారులకు ఈ టన్నెల్ కారణంగా కొత్త సమస్య పరిణమించింది. పర్యాటకుల వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకెళ్లడమే దీనికి కారణమని టన్నెల్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుస్తున్నదని బీఆర్‌వో చీఫ్‌ ఇంజినీర్‌ బ్రిగేడియర్‌ కేపీ పురుషోత్తం తెలిపారు. కుల్లు ఎస్పీ గౌరవ్‌సింగ్‌ స్పందిస్తూ.. టన్నెల్‌ లోపల డాప్లర్‌ రాడార్‌ ఏర్పాటు చేశామని, 40-80 కిలోమీటర్ల వేగ పరిమితి మించిన వాహనాలకు జరిమానా విధిస్తామన్నారు.