పవన్ మూవీ షూటింగ్‌లో ప్రమాదం.. నటుడు ఆదిత్య మీనన్ కు గాయాలు

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీర మల్లు అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పౌరాణిక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. ఇందులో నటిస్తోన్న ప్రముఖ నటుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పవన్ నటిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌లో ఆదిత్య మీనన్ పాల్గొనగా.. గుర్రం నుంచి కింద పడ్డారట. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయట. ఆ సమయంలో వెంటనే ఆయనను ముంబయిలోని ఓ ఆసుపత్రికి తరలించారట. ఇక ఇప్పుడు ఆయనను చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

కాగా బిల్లా మూవీ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య మీనన్.. సింహా, మిర్చి, దూకుడు, అధినాయకుడు, కృష్ణం వందే జగద్గురుమ్, ఈగ, బాద్‌షా, బలుపు, పవర్ తదితర సినిమాల్లో నటించారు. అలాగే ప్రముఖ నృత్యకారిణి సంధ్య రాజు నటిస్తోన్న నాట్యంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

పవన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకోగా.. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.