పౌరుడిగా న్యాయపోరాటానికి సిద్ధమైన నిమ్మగడ్డ ..ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం నేటితో ముగిసింది. రేపటి నుండి నిమ్మగడ్డ మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఐదేళ్ల పాటు పదవిలో ఉన్న ఆయన.. ప్రభుత్వంతో పోరాడిమరీ స్థానిక సంస్థల ఎన్నికలు అనుకున్న సమయానికి నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమయంలో అనేక సమస్యలు వచ్చిన విషయం తెలిసిందే. పదవి కోసం అయన కోర్టు మెట్లు కూడా ఎక్కారు. పదవి కాలం ముగిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎస్ ఈ సీగా తన పదవీకాలం పూర్తి సంతృప్తినిచ్చిందని వెల్లడించారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించామని ఇందులో ప్రభుత్వంతో తోడ్పాటు ఎప్పటికి మరచిపోలేను అని ముఖ్యంగా కలెక్టర్లు పోలీసులు ఇతర సిబ్బంది చక్కగా పనిచేశారని వివరించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా దాఖలైన పిటిషన్లు కోర్టు కేసులపై నిమ్మగడ్డ మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా వ్యవస్థల మధ్య అంతరాలు అనవసరంగా వచ్చాయని ఎన్నికల సిబ్బందిని సెలవుల్లో వెళ్లమన్నారని ఈ పరిస్థితులను వెంటనే చక్కదిద్దామన్నారు. తెలంగాణలో ఉన్న తన ఓటును రద్దు చేసుకుని సొంత గ్రామంలో ఓటుకు దరఖాస్తు చేస్తే దానిని నిరాకరించడం టీ కప్పులో తుఫానుగా మారిందన్నారు. ఇప్పటికీ తన ఓటు హక్కు కలెక్టర్ వద్ద పెండింగ్ లో ఉందని తెలిపారు. తన ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళతానన్నారు. నా హక్కు ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ అని 243కె ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పించిందన్నారు. ఎన్నికల కమిషన్ ఇతర వ్యవస్థలలో జోక్యం చేసుకోకూడదని వాటికి గౌరవం ఇవ్వాలన్నారు. వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నామినేషన్ వెయ్యనివ్వలేనప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు. ఎన్నికల సమయంలో కొంతమంది హక్కులు హరించే చర్యలు జరిగినప్పుడు వాటిని కాపాడటానికి యత్నించినట్లు తెలిపారు. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలు జరిగినప్పుడు వారిటి అండగా నిలబడ్డానని చెప్పారు. వ్యవస్థలో మార్పులు రావాల్సి అవసరముందని.. అందుకే ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్నమంచిపనులను క్రోడీకరించి ఎన్నికల సవరణల కోసం ప్రత్యేక నివేదిక రూపొందించినట్లు వివరించారు. పుస్తకాన్ని గవర్నర్ ను కలిసి అందించేందుకు ప్రయత్నించినా.. అపాయింట్ మెంట్ దొరకలేదన్నారు.