నటుడు దీప్ సిద్ధూ అరెస్టు

కిసాన్ ర్యాలీలో అల్లర్లకు కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్ సిద్ధూను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన స్పెషల్ సెల్ అతడిని అదుపులోకి తీసుకుంది. ఆ శాఖ ఇవాళ దీప్ సిద్దూ ఫోటోలను రిలీజ్ చేసింది. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై జరిగిన దాడి ఘటనలో దీప్ సిద్ధూ ప్రధాన నిందితుడు. ఆ రోజున రైతు ర్యాలీ హింసాత్మకంగా మారడానికి కూడా ఇతనే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఎర్రకోట వైపు దూసుకువచ్చిన రైతులు.. అక్కడ జెండాలను కూడా పాతిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత పరారీలో ఉన్న దీప్ సిద్ధూ కోసం పోలీసులు గాలించారు. అతనిపై రూ. లక్ష రివార్డు ప్రకటించారు.

సిద్ధూతో పాటు మరో ముగ్గురిపై కూడా పోలీసులు రివార్డు ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై సిక్కు జెండాను ఎగురవేసేందుకు సిద్ధూ మిగతా వారిని ప్రేరేపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ ఘటన జరిగినప్పటి నుంచి నిన్నటి వరకు సిద్దూ ఆచూకీ దొరకలేదు. సిద్దూతో పాటు జెండా ఎగురవేసిన జుగ్‌రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్‌, గుర్జంత్ సింగ్‌పై రూ. లక్ష రివార్డు ప్రకటించారు. ఇక జాజ్బిర్ సింగ్‌, బూటా సింగ్‌, సుఖ్‌దేవ్ సింగ్‌, ఇక్బాల్ సింగ్‌పై రూ. 50 వేల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.