శివసేన ఎంపీ అరవింద్ సావంత్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన నటి నవనీత్ కౌర్

ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించారని మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అరెస్ట్ అయిన సచిన్ వాజే, మన్సుఖ్ హిరేన్ హత్య తదితర విషయాలపై మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు పార్లమెంటు ఆవరణలోనే తనను బెదిరించారని స్పీకర్‌కు రాసిన లేఖలో నవనీత్ కౌర్ ఆరోపించారు.

మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తానని, తనను కూడా జైలులో వేస్తానని హెచ్చరించారని అన్నారు. ఆయన బెదిరింపులు మొత్తం మహిళా లోకానికే అవమానమని, వీలైనంత త్వరగా ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ఆ లేఖ ప్రతులను ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీకి కూడా పంపారు.

మరోపక్క, నవనీత్ కౌర్ ఆరోపణలను శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ఖండించారు. ఆమెను తానెందుకు భయపెడతానని ప్రశ్నించారు. ఆమె వ్యవహార శైలి, స్పందించే విధానం ఏమీ బాగాలేదని అన్నారు.