బుగ్గన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన ఆళ్ళ హరి

  • ఇంత దివాళాకోరు ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదు.
  • పేదల రక్తాన్ని మద్యం రూపంలో తాగుతున్న వైసీపీ రాక్షస ప్రభుత్వం
  • విషపూరిత మద్యం తాగి జీవచ్చవాలుగా మారుతున్న ప్రజలు
  • బాధ్యతాయుత మద్యపానం అంటే మద్యం మత్తులో అర్ధరాత్రులు అరాచకాలకు, హత్యలకు, అత్యాచారాలకు పాల్పడటమా?
  • మద్యపానం నిషేధించాకే ఓట్లు అడుగుతాను అన్న మాటపై నిలబడే దమ్ము వైసీపీ నేతలకు ఉందా?

గుంటూరు, మద్యం వల్ల రాష్ట్ర ప్రజలు ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా దెబ్బతింటున్నారని, ఎన్నో పచ్చని సంసారాలు కూలిపోతున్నాయని తాము అధికారంలోకి రాగానే పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆయన వంగమాగదులు ఇప్పుడు మద్యపాన నిషేధం అమలుచేయకపోగా అసెంబ్లీ సాక్షిగా బాధ్యతాయుత మద్యపానం అంటూ కొత్తరాగాన్ని అందుకోవడం దుర్మార్గమని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మా ఆలోచన బాధ్యతాయుత మద్యపానం అంటూ వ్యాఖ్యానించిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిపై ఆయన శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుగ్గనా నీకు అసలు సిగ్గుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దివాళా కోరు ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదని విమర్శించారు. మాట తప్పను మడమ తిప్పను అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎన్ని సార్లు మాట తప్పారో ఎన్నిరకాలుగా మడమలు తిప్పారో ఇచ్చిన హామీలపై ఎన్ని విధాలుగా నాలుక మడతలు పెట్టారో లెక్కేలేదని ధ్వజమెత్తారు. మద్యం మత్తులో హత్యలు, హత్యాచారాలకు పాల్పడటమేనా బాధ్యతాయుత మద్యపానం అంటే అని బుగ్గనను ప్రశ్నించారు. మద్యంలో వాడుతున్న విష పదార్థాల వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. శరీరంలోని అవయవాలు చెడిపోయి ప్రజలు జీవచ్చవాలుగా మారిపోతున్నా వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా ఉండటం లేదని దుయ్యబట్టారు. మద్యపానాన్ని దశల వారీగా నిషేధిస్తాం అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్నారని విమర్శించారు. రేట్లు పెంచి మద్యాన్ని నియంత్రిస్తాం అంటూ చెబుతూనే వేల కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యంగా మద్యాన్ని అమ్ముతున్నారని దుయ్యబట్టారు. సంవత్సరానికి అధికారంగానే మద్యం రూపంలో 16,500 కోట్ల రూపాయల ప్రజల రక్తాన్ని తాగుతున్నారు అంటే అనధికారికంగా ఇంకెన్ని వేల కోట్లు దోచుకుంటున్నారోనన్నారు. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాకే 2024 లో ఓట్లు అడుగుతాను అన్న మాటపై నిలబడే దమ్మూ ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్న కొద్దిపాటి సమయంలోనైనా ప్రజల రుణాన్ని తీర్చుకునేలా పరిపాలన కొనసాగించాలని కోరారు. లేనిపక్షంలో చరిత్ర హీనులుగా వైసీపీ నేతలు మిగిలిపోతారని ఆళ్ళ హరి హెచ్చరించారు.