అరుదైన ఘనతను సాధించిన అంబానీ ట్విన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె, కుమారుడు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీలు ఓ అరుదైన ఘనతను సాధించారు. ఫార్చూన్ మేగజీన్ ప్రచురించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలురైన ’40 అండర్ 40′ జాబితాలో వారికి స్థానం దక్కింది. వారితోపాటు BYJUs ఫౌండర్ రవీంద్రన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో ఎదరవుతున్న కొత్త కొత్త సవాళ్లను ఈ యువ ఎగ్జిక్యూటివ్‌లు సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా, తమ ఉద్యోగులను ఉత్సాహ పరుస్తూ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లారని ఫార్చూన్ మేగజీన్ కొనియాడింది. ఈ ఏడాది ఐదు విభాగాలను పరిశీలించి ’40 అండర్ 40′ జాబితాను ప్రకటించింది. ఫైనాన్స్, టెక్నాలజీ, హెల్త్ కేర్, ప్రభుత్వం – రాజకీయాలు, మీడియా – ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల నుంచి ప్రభావశీలురను ఎంపిక చేసింది. టెక్నాలజీ జాబితాలో ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ పేర్లు పొందుపరిచింది.

‘సహజంగా డేటాను చమురుతో పోలుస్తారు. భారత్‌లో అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు వచ్చేసరికి అది వాస్తవంగా మారింది. 47 సంవత్సరాల రిలయన్స్ ఇండస్ట్రీస్ 2016లో జియో మొబైల్ నెట్ వర్క్‌ను తీసుకురాకముందు విభిన్న రంగాల్లో వేళ్లూనుకుని ఉంది. అందులో పెట్రో కెమికల్స్ కూడా ఒకటి.రిలయన్స్ అనేది కుటుంబ వ్యాపారం. ఆకాష్ అంబానీ బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పొందిన తర్వాత 2014 సంవత్సరంలో రిలయన్స్ కంపెనీలో చేరారు. ఆ తర్వాత యేల్, స్టాన్‌ఫోర్డ్, మెక్‌కిన్సే లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించారు. జియో బోర్డు మెంబర్స్‌గా ఇటీవల 5.7 బిలియన్ అమెరికన్ డాలర్లను ఫేస్ బుక్ సంస్థ జియోలో పెట్టుబడి పెట్టే డీల్‌ను సమర్థంగా హ్యాండిల్ చేశారు. ఆ తర్వాత గూగుల్, క్వాల్కం, ఇంటెల్ లాంటి సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టాయి.

అంబానీ వారసుల్లో తాజాగా అనంత్ అంబానీ కూడా జియో బోర్డు మెంబర్‌గా జాయిన్ అయ్యారు. జియోతోపాటు ఈ- కామర్స్ మీద కూడా అంబానీలు ప్రధానంగా దృష్టి సారించారు. కొన్ని రోజుల క్రితం ఇషా, ఆకాష్ అంబానీలు జియో మార్ట్‌ను ప్రారంభించారు. అమెజాన్, వాల్ మార్ట్ లాంటి ఆన్ లైన్ గ్రాసరీ సంస్థలకు జియో మార్ట్ భారత్‌లో గట్టిపోటీ ఇవ్వనుంది. మీడియా, వినోదం అనే ఐదు విభాగాలలో 40మంది ప్రభావవంతమైన వ్యక్తులను గుర్తించి ఈ వార్షిక జాబితాను రూపొందిస్తుంది.