కల్పనా చావ్లా పేరిట అమెరికన్ స్పేస్ క్రాఫ్ట్

అంతరిక్షానికి వెళ్లిన తొలి భారత మహిళా ఆస్ట్రోనాట్ గా చరిత్ర సృష్టించిన తొలి మహిళ కల్పనా చావ్లా. 1996లో తొలిసారిగా అంతరిక్షానికి ఎగిరి చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా మరోసారి తన ఉన్నతిని చాటుకుంది. మరణించినా కూడా ఆమె సేవలను.. కృషిని ఎప్పటికీ మరువలేం. అందుకే కల్పనా చావ్లా పేరును ఓ కమర్షియల్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ కు పెట్టాలని అమెరికన్ సంస్థ నిర్ణయించింది. యూఎస్ కేంద్రంగా నడుస్తున్న గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సేవల సంస్థ ‘నార్త్ రాప్ గ్రూమన్’ వాణిజ్య రవాణా స్పేస్ క్రాఫ్ట్ గా అంతరిక్షంలోకి పంపనున్న సిగ్నస్ క్యాప్స్యూల్ కు ఎస్ఎస్ కల్పనా చావ్లా అని పేరు పెడుతున్నట్టు సంస్థ తెలిపింది.

2003లో స్పేస్ షటిల్ కొలంబియాలో అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వస్తూ, ఘోర ప్రమాదంలో అసువులు బాసింది కల్పనా చావ్లా. ఆమె పేరు చరిత్రలో నిలిచిపోనుంది. గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సేవల సంస్థ ‘నార్త్ రాప్ గ్రూమన్’ వచ్చే సంవత్సరం వాణిజ్య రవాణా స్పేస్ క్రాఫ్ట్ గా అంతరిక్షంలోకి పంపనున్న సిగ్నస్ క్యాప్స్యూల్ కు ఎస్ఎస్ కల్పనా చావ్లా అని పేరు పెట్టనుంది.

ఈ విషయాన్ని తన అధికార ట్విట్టర్ ఖాతాలో తెలియజేసిన నార్త్ రాప్ గ్రూమన్, “మేము ఇవాళ కల్పనా చావ్లాను గౌరవిస్తున్నాం. ఆమె తొలి భారత మహిళా వ్యోమగామిగా నాసాలో చరిత్ర సృష్టించారు. హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్స్ అభివృద్ధిలో ఆమె ఎంతో సేవ చేశారు” అని పేర్కొంది. “ఎన్జీ-14 సిగ్నస్ ఎయిర్ క్రాఫ్ట్ కు కల్పనా చావ్లా పేరును పెట్టడాన్ని నార్త్ రాప్ గ్రూమన్ గర్వంగా భావిస్తోంది. ప్రతి సిగ్నస్ కూ అంతరిక్ష సేవలందించిన వారి పేర్లను పెట్టాలని కూడా నిర్ణయించాం” అని కంపెనీ వెబ్ సైట్ తెలిపింది.

కల్పనా చావ్లా పేరిట నింగిలోకి వెళ్లనున్న స్పేస్ క్రాఫ్ట్ 3,629 కిలోల బరువును స్పేస్ స్టేషన్ కు చేర్చనుంది. వర్జీనియాలో ఉన్న నాసా వాలోప్స్ ఫ్లయిట్ ఫెసిలిటీ నుంచి ఈ సెప్టెంబర్ 29న నింగిలోకి ఎగరనుంది.