ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటివరకూ గురుగ్రామ్ వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా ఢిల్లీ ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. కరోనా బారి నుంచి కోలుకున్న అమిత్ షా శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రి మారినట్లు సమాచారం. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచే అమిత్ షా విధులు నిర్వహించనునన్నారు. అమిత్ షాకు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలోని వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కాగా, ఆగస్టు 2న అమిత్ షా కరోనా సోకిన కారణంగా గురుగ్రామ్ వేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత నిర్వహించిన కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో ఈ నెల 14న ఆయనకు నెగటివ్‌గా తేలింది. అయినా డాక్టర్ల సూచన మేరకు వైద్యుల పర్యవేక్షణలోనే అక్కడే ఉండి పరిపాలనా వ్యవహారాలు చూస్తున్నారు. ఈ క్రమంలో శ్వాసకోశ సమస్య అధికం కావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. అమిత్ షా ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదని, త్వరలోనే కోలుకుని డిశ్ఛార్జ్ అవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు.