కశ్మీర్‌కు చేరుకున్న అమిత్‌ షా.. 370 రద్దు అనంతరం తొలిసారి

మూడు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు జమ్మూ- కశ్మీర్‌కు చేరుకున్నారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం ఆయన కశ్మీర్‌కు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా శ్రీనగర్‌ విమానాశ్రయంలో స్థానిక లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమిత్‌ షా.. ఇటీవల ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన జమ్మూకశ్మీర్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ పర్వేజ్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అహ్మద్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అనంతరం కశ్మీర్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులపై హోం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లపైన కూడ ఆయన దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు శ్రీనగర్‌- షార్జా మధ్య విమాన సేవలను ప్రారంభించనున్నట్లు సమాచారం.

పకడ్బందీ భద్రతాచర్యలు..

ఒకవైపు కశ్మీర్‌ లోయలో వరుసగా పౌర హత్యలు, మరోవైపు ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు భద్రతా బలగాల ఎన్‌కౌంటర్లు కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో అమిత్‌ షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లోయలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రి బస చేసే శ్రీనగర్‌లోని రాజ్ భవన్ చుట్టూ 20 కి.మీ పరిధిలో అనుమానాస్పద కదలికలను ట్రాక్ చేసేందుకు డ్రోన్‌లు ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్‌ బలగాలు దాల్ సరస్సు, ఇతర ప్రాంతాలపై నిఘా చేపట్టాయి. వ్యూహాత్మక ప్రదేశాల్లో స్నైపర్లు, షార్ప్‌షూటర్‌లను మోహరించారు. స్థానిక పోలీసులు.. పౌరులతోపాటు వాహనాలనూ తనిఖీ చేస్తున్నారు.