పుట్టినరోజు సందర్భంగా ఒక స్పూర్తిదాయకమైన నిర్ణయం… కేటీఆర్

తన పుట్టినరోజు సందర్భంగా స్పూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. కరోనా నేపథ్యంలో తనవంతుగా ప్రభుత్వాస్పత్రులకు ఆరు అంబులెన్సులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం(జూలై 23) ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రగతి భవన్‌లో కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పిన సందర్భంగా… ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. కేటీఆర్ స్పూర్తితో…అదే బాటలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తాము కూడా ప్రభుత్వాస్పత్రులకు అంబులెన్సులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు.

ఈటల తనవంతుగా తన నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఐదు అంబులెన్సులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. అటుపై మంత్రి జగదీశ్ రెడ్డి కూడా నల్గొండ జిల్లాకు తన వంతుగా 6 అంబులెన్సులు అందజేస్తానని హామీ ఇచ్చారు. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ తరుపున 11 అంబులెన్సులు అందజేస్తామన్నారు.

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తానొక్కడినే ఏడు అంబులెన్సులు అందజేస్తానని ముందుకు రావడం గమనార్హం. మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్,ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరు చొప్పున అంబులెన్సులు ఇస్తామన్నారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్ మరియు గణేష్ గుప్తా కలిసి మూడు అంబులెన్సులు అందిస్తామన్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి రెండు చొప్పున అంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

ఇక వరంగల్ జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ఒక్కో అంబులెన్సు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని,ఇందుకోసం దాతలతో సంప్రదింపులు జరుపుతామని మంత్రులు సత్యవతి రాథోడ్,ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తనవంతుగా జిల్లాకు 4 అంబులెన్సులు అందజేస్తానని చెప్పారు.