ఏపీలో కరోనాకు అత్యవసర మందుగా… రెమ్‌డెసివిర్

ఏపీలో కరోనా ప్రభావం గుర్తించడంలో సీఎం జగన్ తొలుత కాస్త తడబడినా ఆ తర్వాత వేగంగా స్పందించారు. అధికారులను పిలిపించుకుని వాస్తవ పరిస్దితిని అంచనా వేయగా జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.

కరోనా అత్యవసర చికిత్సలో భాగంగా వాడుతున్న రెమ్‌డెసివిర్ మాత్రలను వాడాలా వద్దా అని రాష్ట్రాలు తటపటాయిస్తున్న వేళ.. జగన్ మాత్రం ఇందుకు సై అన్నారు. హెటిరో ఉత్పత్తి చేస్తున్న రెమిడెసివిర్ మాత్రలను భారీ స్ధాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జగన్ తాజాగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో హెటిరో నుంచి తొలి దశలో దాదాపు 15 వేల డోసులకు పైగా ఆర్డర్ ఇచ్చారు. వీటిని ఇవాళ సాయంత్రం నుంచి కరోనా ప్రత్యేక ఆస్పత్రుల్లో అత్యవసర మందులుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో అత్యవసర పరిస్ధితుల్లో ప్రాణాలు కోల్పోతున్న రోగులకు తక్షణ ఉపశమనం లభించనుంది.

ఏపీలో ప్రస్తుతం పనిచేస్తున్న కోవిడ్ 19 ఆస్పత్రులకు తొలిదశలో 15 వేల రెమ్‌డెసివిర్ డోసులను పంపిస్తున్నారు. వీటిని ఒక్కో రోగికి రెండు, మూడు సార్లు అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన భారీగా డోసులు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీగా రెమ్‌డెసివిర్ డోసులను అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ వినతి మేరకు హెటిరో డ్రగ్స్… ఆగస్టు మూడో వారం నాటికి మరో 70 వేల డోసులను ఏపీకి పంపుతుంది.