ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచి రోజులు తీసుకొస్తుంది

* ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్
దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో రాష్ట్ర విషయాల పట్ల చర్చించామని, కచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు మంచి రోజులు తెచ్చే సమావేశం అని జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ చోళలో శుక్రవారం రాత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “దాదాపు 8 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం సంతోషంగా ఉంది. 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోదీ గారితో కలిసి ఎన్నికల ప్రచారం తర్వాత మళ్లీ మోదీ గారిని కలవలేదు. ఇప్పుడు రాష్ట్ర పర్యటన సందర్భంగా రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. శ్రీ మోదీ గారిని కలవాలని చెప్పడంతో ఈ రోజు ఆయనతో పలు విషయాలపై చర్చించాం. రాష్ట్రంలోని వివిధ అంశాలను, పరిస్థితులను శ్రీ మోదీ గారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాటిపై నా వద్ద ఉన్న సమాచారాన్ని ఆయనతో పంచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి అన్నదే ప్రధాని ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలన్నదే శ్రీ మోదీ గారు కోరుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో శ్రీ నరేంద్ర మోదీ గారితో ఈ సమావేశం జరిగింది. కచ్చితంగా దీని ఫలితాలు ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, భవిష్యత్తు కోసం ఉంటాయి” అన్నారు. పవన్ కళ్యాణ్ వెంట పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.