అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కొత్త రథం నమూనా

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్దం ఘటనపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిoది. ఈ క్రమంలోనే కొత్త రథానికి సంబంధించి రూపు రేఖల గ్రాఫ్ సిద్ధమైంది. ఆలయ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్‌, ఏసీ భద్రాజీ రథం ఎలా ఉండాలో తాజాగా చర్చించారు. పాతరథం నమూనా తో పోలి ఉండి మరింత ఆకర్షణీయంగా, అత్యంత శాస్త్రబద్ధంగా ఉండేలా డిజైన్ సిద్ధం చేశారు. కొత్త రథం 41 అడుగుల ఎత్తు ఉండనుంది. ఆరు చక్రాలతో ఏడు అంతస్తులుగా ఉంటుంది. రథం నిర్మాణానికి, షెడ్డు రిపేర్, ఇనుప షట్టర్‌ ఏర్పాట్లకు  రూ.95 లక్షలు అవుతాయని అంచనా వేసారు. కాలిపోయిన రథానికి రూ.84 లక్షల ఇన్సూరెన్స్ ఉంది కానీ ఇన్సూరెన్స్ డబ్బు రావడానికి సమయం పడుతుంది. ఎందుకంటే… రథం ఎందుకు కాలిందో తేలాల్సి ఉంది. తేలిన తర్వాత ఇన్సూరెన్స్ వర్తిస్తుందా లేదా అన్నది తేల్చుతారు. అందుకే కొత్త రథాన్ని ప్రభుత్వమే తయారుచేయించబోతోంది. 2021 ఫిబ్రవరిలో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాల లోపు రథాన్ని సిద్ధం చేయనున్నారు.