లక్షల రూపాయల జరిమానా అని రైతులను బెదిరిస్తారా?

• తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి… కౌలు రైతులను ఆదుకోవాలి
• జనసేన పి.ఎ.సి.ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అన్నం పెట్టే రైతులను వేధింపులకు గురి చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతులు రోడ్ల మీద ధాన్యం ఆరబోస్తే రూ.5 లక్షలు జరిమానా విధిస్తామని ఈ ప్రభుత్వం బెదిరించడం దురదృష్టకరం అన్నారు. రైతుల నుంచి తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలనీ, కౌలు రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రెండు అంశాల మీద జనసేన పార్టీ రైతుల పక్షాన మాట్లాడుతుందని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ, శ్రీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రైతులకు అండగా నిలబడతారని తెలిపారు. మొదటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. తూర్పుగోదావరి జిల్లా, మండపేట నియోజకవర్గం ఇప్పనపాడు గ్రామంలో కళ్లాల వద్ద రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలు వివరించారు. పంటలకు 100 శాతం నష్టం జరిగిందని, ధాన్యం కొనమని అడిగితే రైతు భరోసా కేంద్రాలకు తీసుకురమ్మంటున్నారనీ వాటికీ ఎన్నో రూల్స్ చెబుతున్నారు అన్నారు. ఒక్కో రైతు దగ్గర కేవలం 25 క్వింటాళ్లు మించి కొనుగోలు చేసేది లేదు అని ప్రభుత్వం ప్రకటించడం తమకు ఇబ్బందిగా మారిందని రైతులు తెలిపారు. పంటలు కొనేవారు లేకపోవడంతో తదుపరి పంటకు పెట్టుబడి ఎలా వస్తుందని వాపోయారు. ఎకరాకి రూ. 30 వేలు ఖర్చు చేస్తే, ఇప్పుడు 10 బస్తాలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదన్నారు. చేతికి వచ్చిన పంట పోయిందనీ, కూలీ కూడా గిట్టడం లేదనీ రైతులు తెలిపారు. మొత్తం మొలకలు వచ్చేశాయని చెప్పారు. తమ గ్రామంలో 400 ఎకరాల వరి పండించే పొలం ఉంది. అధికారులు వచ్చి సర్వే చేసి వెళ్లారు. పరిహారం ఎంత ఇస్తారో తెలియదు అని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క పంటా సరిగా రాలేదని చెప్పారు. క్రాఫ్ ఇన్సురెన్స్ రావడం లేదా అని శ్రీ నాదెండ్ల మనోహర్ రైతులను అడిగారు. గత ఏడాది నష్టపోయిన పంటలకు కూడా ఇప్పటికీ పరిహారం అందలేదని రైతులు చెప్పారు. జనసేన పార్టీ రైతులకు అండగా నిలబడి న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, మండపేట ఇంచార్జ్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, పీఏసీ సభ్యులు శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ పంతం నానాజీలతోపాటు నియోజకవర్గాల ఇంచార్జులు, పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

• ఉండ్రాజవరం రైతుల గోడు

జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ బుధవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన కౌలు రైతులను కలిశారు. 65వ నంబర్ జాతీయ రహదారి దగ్గర్లో ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతులతో సంభాషించారు. కౌలు రైతులు శ్రీ దశమంతు, శ్రీ అనకాపల్లి శివరామప్రసాద్ లు తమ కష్టాలు చెప్పుకొన్నారు. తడిసిన ధాన్యం ముక్క అవుతుందన్న నెపంతో మిల్లర్లు ధర ఇష్టారాజ్యంగా తగ్గించేస్తున్నారనీ, రైతు భరోసా కేంద్రాలకి వెళ్తే పరిమితి దాటిపోయిందని కొనడం లేదని వాపోయారు. రైతుకు సమాజంలో విలువ లేదు.. సుఖమూ లేదని బాధపడ్డారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయలేనప్పుడు లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం సుఖమన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రైతాంగం ప్రయోజనాల కోసం శ్రీ పవన్ కళ్యాణ్ నిలబడతారు అన్నారు.