అర్నబ్‌ గోస్వామి అరెస్టు.. మరో కేసు నమోదు.. స్పందించిన బాధిత కుటుంబం..

ముంబై పోలీసులు రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యం లో గోస్వామిపై ముంబై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీస్‌ అధికారులను అడ్డుకుని వారి విధులకు ఆటంకం కలిగించింనందుకు అర్నబ్‌తోపాటు ఆయన భార్యపై పలు సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించకపోవడంతో 2018లో 53 ఏండ్ల ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్న కేసునకు సంబంధించి ముంబై పోలీసులు బుధవారం అర్నబ్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే ఈ సందర్భంగా అర్నబ్‌తోపాటు ఆయన భార్య, పోలీసులపై అనుచితంగా ప్రవర్తించారని, మహిళా పోలీస్‌ పట్ల చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇద్దరు పోలీస్‌ అధికారులు తనపై దాడి చేసినట్లు అర్నబ్‌ ఆరోపించారు. అర్నబ్‌ కుటుంబ సభ్యలును కూడా పోలీసులు తోసివేశారని, ఆయన ఇంటిని మూడు గంటల పాటు దిగ్బంధించారని ఆయన తరఫు న్యాయవాది గౌరవ్ పార్కర్ పేర్కొన్నారు.

అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేయడంపై బాధిత కుటుంబం స్పందించింది. మహారాష్ట్ర పోలీసులకు మృతుడి భార్య అక్షిత, కుమార్తె అద్యా నాయక్‌ ధన్యవాదాలు తెలిపారు. అర్నబ్‌ అరెస్ట్‌తో తమకు ఇప్పటికైనా న్యాయం జరిగిందని వారు అన్నారు.