రామ మందిర భూమి పూజ ఏర్పాట్లు, అతిథులకు ఆహ్వానం

అయోధ్యలో రామ మందిర భూమి పూజకు సమయం దగ్గరపడడంతో భూమి పూజ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ కార్యక్రమానికి అతిథుల ఆహ్వానం, ఇతర ఏర్పాట్లపై వివరాలను వెల్లడించింది. మొత్తం 175 మంది ప్రముఖులతోపాటు, 135 మంది సాధువులను, అయోధ్యకు చెందిన కొందరు ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపింది.

కరోనా కారణంగానే ఎక్కువ మంది అతిథులను ఆహ్వానించలేకపోయామని ట్రస్ట్ తెలిపింది. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ తోపాటు రామ జన్మభూమి న్యాస్ అధిపతి నృత్యగోపాల్ దాస్ వేదిక పంచుకుంటారని

ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ హనుమాన్ మందిరాన్ని దర్శించుకుని, అక్కడ్నుంచి రామ జన్మభూమిలోని రామ్‌లల్లాలో పూజలు నిర్వహించిన అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపింది. కాగా, భూమి పూజ కోసం 2వేల తీర్థక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి, 100 నదుల నుంచి నీరు తెప్పించినట్లు తెలిపింది.

దేశ వ్యాప్తంగా ఉన్న అనేకమంది సాధువులు ఎన్నో రకాల పవిత్ర వస్తువులను భూమి పూజ కోసం పంపినట్లు తీర్థ క్షేత్ర ట్రస్ట్ చెప్పింది. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే.. అన్ని గ్రామాలు, నగరాల్లో భజనలు, కీర్తనలు, ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులకు ట్రస్ట్ పిలుపునిచ్చింది. భూమి పూజ నేపథ్యంలో పోలీసులు అయోధ్యలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

రామ మందిర భూమి పూజ కోసం కాశీ నుంచి వెండి తమలపాకులు తరలివచ్చాయి. వారణాసిలోని కాశీ చౌరాసియా సంఘానికి చెందినవారు వెండితో ప్రత్యేకంగా ఐదు తమలపాకులను తయారు చేయించి ఆ సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్ చౌరిసియా వీటిని వేద పండితులకు అందజేశారు. వారు ఈ తమలపాకులను తీసుకుని అయోధ్యకు బయల్దేరివెళ్లారు.