గోవధ నిషేధ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

గోవధను నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవధ నిసేధం, పశువుల సంరక్షణ బిల్లు 2020కి కర్ణాటక అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. కాగా, గవర్నర్ ఆమోదం పొందడమే తరువాయి.. ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చవాన్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు చట్టం ప్రకారం.. ఎవరైనా గోవధ, గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన శిక్షకు అర్హులవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అంతేగాక, నిందితులపై వేగంగా విచారణ జరపడానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలనే నిబంధన కూడా ఉందని తెలిపారు.

అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. చర్చ లేకుండానే ఈ బిల్లును సభలో ఆమోదించారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. అసలు అజెండాలోనే లేని బిల్లును సభలో ప్రవేశపెట్టడం.. పైగా దానిని ఏకపక్షంగా ఆమోదించుకోవడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ప్రతిపక్ష నాయకులంతా యడ్యూరప్ప ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ తీరుకు నిసనగా ప్రతిపక్ష నాయకులు సభ నుంచి వాకౌట్ చేశారు.