చిత్తూరులో రైతు కుటుంబానికి భరోసా: సోనూసూద్

ఆపదలో ఉన్న వారిని ఆదుకొనే అభయ హస్తం అంటే వినిపించే పేరు సోనూసూద్. అవును.. లాక్ డౌన్ వల్ల కూలీల వెతలతో బయటకొచ్చిన సోనూసూద్ మంచి మనసు మరియు  మంచి పనుల పరంపర.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరా, ఇద్దరా, పలువురికి ఆయన సాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా  చిత్తూరు జిల్లాకు చెందిన మరో రైతు చనిపోవడంతో సోనూ సూద్ స్పందించారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసానిచ్చారు. శుక్రవారం అతని ప్రతినిధులు కుటుంబాన్ని కలిసి.. సాయం అందించబోతున్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కలగటూరుకి చెందిన వెంకటరామయ్య ప్రమాదవశాత్తు చనిపోయారు. అతని గుండెలపై ఆవు తొక్కడంతో గాయపడ్డారు. దీంతో పలమనేరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. గత మూడురోజుల నుంచి వైద్యం తీసుకున్నా ఫలితం లేకపోయింది. చనిపోవడంతో.. మృతదేహాన్ని ఆటో వారు రోడ్డుపైనే పడవేసి వెళ్లిపోయారు. దీంతో అతని కూతురు బోరున విలపించారు. ఈ ఘటన తెలుసుకొని సోనూసూద్ చలించిపోయారు. వెంకటరామయ్య కూతురిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ఈరోజు బెంగళూరు నుంచి సోనుసూద్ మనుషులు పలమనేరు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోనున్నారు.