డిజిటల్ కాంపెయిన్ లో ఆత్మకూరు నియోజకవర్గం

జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, గత మూడు రోజులుగా ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సాగిస్తున్న, విశాఖ ఉక్కు పరిరక్షణ డిజిటల్ ఉద్యమం, ఈరోజు మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్, స్థానిక జనసైనికులు తో కలిసి, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, అనంతరం ఆత్మకూరు మెయిన్ బజార్ లో ప్లకార్డులు చేతపట్టి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పేరులోనే ఒక శక్తి ఉంది. అది ఎంతటి శక్తి అంటే, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తట్టిలేపి, ఉద్యమ స్ఫూర్తికి ఊపిరిలూది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దేశవ్యాప్తంగా వినిపించేలా, నినదించిన స్వరంలోని శక్తి అది. ఇదే నినాదమై విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు గా మారింది. 1953 భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి, అభివృద్ధికి దూరమైన అనంతరం, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజానీకం అంతా ఒక్కటై ముక్తకంఠంతో పోరాడి సాధించుకున్న విజయం, ఈ విశాఖ ఉక్కు. స్వాతంత్రం సిద్ధించిన అనంతరం దేశ అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన తొలి మూడు పంచవర్ష ప్రణాళికలలో, మన ఆంధ్రప్రదేశ్ ఉద్దేశపూర్వకంగా విస్మరించబడింది. పారిశ్రామిక అభివృద్ధి జరిగితేనే మన రాష్ట్ర అభివృద్ధికి బాట ఏర్పడుతుందని యావత్ తెలుగుజాతి భావించింది. ఈ భావమే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదమై రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి దారితీసింది. ఈ ఉద్యమంలో ప్రముఖ గాంధేయవాది తెన్నేటి విశ్వనాథం గారి కృషి ఉంది. గుంటూరు చెందిన అమృత రావు విశాఖపట్నం నుండి సాగించిన ఆమరణ నిరాహార దీక్ష ఉంది. 32 మంది ఉద్యమకారుల ప్రాణత్యాగం ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి,కురుపాం జమిందార్లు దానం చేసిన 600 ఎకరాలు భూమితో సహా, 26 వేల ఎకరాల భూసేకరణలో ఎంతో మంది అన్నదాతల త్యాగం ఉంది. నలుగురు ం.ఫ్లతో సహా, 67 మంది ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల నిజాయితీ ఉంది. ఇలా ఏళ్ల తరబడి ఎదురు చూపులు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో ప్రాణ త్యాగాల ఫలితంగా, 1971లో శంకుస్థాపన జరిగి 1990లో ఉత్పత్తి ప్రారంభించబడింది మన విశాఖ ఉక్కు కర్మాగారం. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంగా, త్యాగాల ప్రతిరూపంగా నిలిచిన ఈ విశాఖ ఉక్కును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. గతంలో,ఈ కర్మాగార స్థాపన కొరకు రాజీనామా చేసిన 67 మంది ఎమ్మెల్యేలు నలుగురు MP ల బాటలోనే మన రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయవలసిన నైతిక బాధ్యత ఉంది. ఈ బాధ్యతను మరచిన ఎంపీలకు, జనసేన పార్టీ తరఫున మేము చేస్తున్న విన్నపం ఒకటే. కనీసం పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకుని నిలబడండి, నిరసన తెలియ చేయండి.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపండి, అని జనసేన పార్టీ తరఫున అధికార పార్టీ ఎంపీలను జనసేన పార్టీ తరఫున డిజిటల్ ఉద్యమం ద్వారా డిమాండ్ చేస్తున్నాము.