బాబాసాహెబ్‌ అంబేడ్కర్ జయంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళి

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మహనీయుని ఆదర్శాలను ప్రజలు తమ జీవితాల్లో ఇముడ్చుకోవాలని, ఆయన స్ఫూర్తితో శక్తిమంతమైన దేశ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు. అణగారిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని చెప్పారు.

‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. సమసమాజాన్ని నిర్మించడానికి జీవితకాలం కష్టపడ్డారు. అంబేడ్కర్‌ ఆదర్శాలను ప్రజలు తమ జీవితాల్లో ఇముడ్చుకోవాలి. ఆయన స్ఫూర్తితో శక్తిమంతమైన దేశ నిర్మాణానికి ప్రజలు తోడ్పడాలి’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.

‘భారత రత్న డా. బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నాను. సమాజంలోని అట్టడుగు వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఆయన చేసిన పోరాటం ప్రతి తరానికి ఒక ఉదాహరణగా కొనసాగుతుందని’ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.