మంత్రి విజయ్ షాకి హెయిర్ కట్ చేసిన బార్బర్‌.. రూ. 60 వేలు నజరానా!

గత ఆరు నెలలుగా కరోనా అందరినీ ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. పనితనం, నైపుణ్యం ఉన్నప్పటికీ కస్టమర్లు ఎవరూ రాకపోవడంతో వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా బార్బర్ పనిచేసేవాళ్లకి పరిస్థితి దారుణం. కానీ ఇప్పుడు కరోనా నిబంధనలు, జాగ్రత్తలు తీసుకోవడంతో కస్టమర్లలో బయం పోయి ఇప్పడిప్పుడు సెలూన్ షాపుకు వస్తున్నారు. అలా ఓ బార్బర్ సొంతంగా షాపు పెట్టుకోవడానికి డబ్బు లేకపోవడంతో మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాను సహాయం కోరాడు. ఇటీవల ఖండ్వా జిల్లాలోని గులైమాల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి విజయ్ షా హాజరయ్యారు.

అప్పుడు రోహిదాస్ అనే బార్బర్‌ను స్టేజ్ మీదకు పిలిచి తనకు హెయిర్‌కట్‌, షేవింగ్ చేయాలని కోరారు మంత్రి షా. తన ప్రతిభను ప్రదర్శించే సమయం ఆసన్నమైందని రోహిదాస్ చేతులకు శానిటైజర్‌, ఫేస్‌మాస్క్ ధరించి మంత్రికి హెయిర్ కట్ చేశాడు. తర్వాత షేవింగ్ కూడా పూర్తి చేశాడు. బార్బర్ పనితనం మెచ్చి విజయ్ షా స్టేజ్ మీదనే రూ. 60, 000 ఇచ్చారు. దీంతో సెలూన్ షాపు పెట్టుకోమని ఆదేశమిచ్చారు. హెయిర్ కట్ చేసే ముందు బార్బర్ జాగ్రత్త చర్యలు తీసుకుంటే కరోనా నుంచి ప్రజలు సురక్షితంగా ఉంటారనే భరోసా బార్బర్ కల్పించాలని మంత్రి కోరారు.