‘స్పుత్నిక్‌ వి’ పై డాక్టర్‌ రెడ్డీస్‌ ఫేజ్-3 క్లినికల్‌ పరీక్షలు

భారత్ లో కరోనావైరస్ కట్టడికోసం ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. రష్యా తయారు చేసిన కొవిడ్‌-19 టీకా ‘స్పుత్నిక్‌ వి’పై మనదేశంలో మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించటానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ అనుమతి కోరుతూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు కంపెనీ దరఖాస్తు చేసింది. స్పుత్నిక్‌ వి టీకాను మనదేశంలో పరీక్షించి, ఆ తర్వాత తయారు చేసి విక్రయించటానికి డాక్టర్‌ రెడ్డీస్‌, రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ (రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌) తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. అన్ని అనుమతులు వచ్చాక డాక్టర్‌ రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల స్పుత్నిక్‌ వి టీకాను సరఫరా చేయటానికి ఆర్‌డీఐఎఫ్‌ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డాక్టర్‌ రెడ్డీస్‌ తగిన సన్నాహాలు చేపట్టింది. రష్యాలో ఈ టీకాపై ఇప్పటికే మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి.