వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్త: మోదీ

దేశ ప్రజలు కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోవద్దు అని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రారంభంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. తాను ప్రజల నుంచి కోరుకుంటున్నది ఏంటంటే.. ఫేస్ మాస్క్‌లు ధరించాలన్న నిబంధనను పాటించాలని, శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే వరకు సామాజిక దూరాన్ని పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండి, తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబంలోని వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. శాస్ర్తవేత్తలందరూ వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు తమకు తాము రక్షించుకునేందుకు సామాజిక దూరం పాటించడమే ఉత్తమ మార్గమని మోదీ అన్నారు.