మనుషుల్లో బర్డ్ ఫ్లూ.. రష్యాలో మొదటి కేసు నమోదు

మాస్కో : బర్డ్‌ ఫ్లూ పక్షుల నుండి మనుషులకు సోకినట్లు రష్యా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఏవియన్‌ ఫ్లూ వైరస్‌ హెచ్‌5ఎన్‌8ని మానవుల్లో గుర్తించినట్లు తెలిపారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థను అప్రమత్తం చేసినట్లు రష్యా శాస్త్రవేత్తలు వెల్లడించారు. రష్యా ఆరోగ్య సంస్థ రోస్పోట్రెబ్నాడ్జోర్‌ డైరెక్టర్‌ అన్నాపొపోవా మాట్లాడుతూ.. వెక్టర్‌ ప్రయోగశాలలోని శాస్త్రవేత్తలు దక్షిణ రష్యాలోని ఒక పౌల్ట్రీ ఫామ్‌లో ఏడుగురు కార్మికుల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ను గుర్తించారని అన్నారు. ఇక్కడ గతేడాది డిసెంబర్‌లో బర్డ్‌ ఫ్లూ వ్యాపించిందని చెప్పారు. అయితే వారిలో ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారమిచ్చామని పొపొవా చెప్పారు. ఏవియన్‌ ఫ్లూలో విభిన్న ఉప జాతులు ఉన్నాయి. హెచ్‌5ఎన్‌8 వైరస్‌ పక్షులకు ప్రాణాంతకమని.. మానవులపై పెద్దగా ప్రభావం చూపలేదని అన్నారు. వీటిలో హెచ్‌5ఎన్‌1, హెచ్‌7ఎన్‌9, హెచ్‌1ఎన్‌1 వైరస్‌లు మానవులకు సోకుతున్నాయని అన్నారు. హెచ్‌5ఎన్‌1 వైరస్‌ మానవుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుందని.. 60శాతం మరణాల రేటును కలిగి ఉంటుందని చెప్పారు.