బీజేపీ- జనసేనల చలో రామతీర్థం ధర్మ యాత్ర

ఆంధ్రప్రదేశ్‌లో రామతీర్థం ఇప్పుడు రాజకీయానికి కేరాఫ్‌ అడ్రస్‌ గా మారింది. కోదండ రామాలయంలో గతనెల 28న గుర్తుతెలియని దుండగులు రాములోరి విగ్రహం నుంచి తలను వేరు చేసి కోనేట్లో పడేయడం… రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వారం రోజులుగా రామతీర్ధంలో నిరసనలు వ్య క్తం చేస్తున్న బీజేపీ… తన మిత్రపక్షమైన జనసేనతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలతో కలిసి రెండు పార్టీలు ఇవాళ(05 జనవరి 2020) రామతీర్థం ధర్మ యాత్రకు చలో రామతీర్ధంకు పిలుపునిచ్చింది. దీంతో మరోసారి ఉత్కంఠ పరిస్ధితులు నెలకొననున్నాయి. మరోవైపు.. బీజేపీ, జనసేన నేతలను హౌస్‌ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు పోలీసులు.. నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు.. ఇక, కొంతమంది నేతలు ఇళ్లలో లేకుండా వెళ్లినట్టు తెలుస్తోంది.. ఎలాగైనా రామతీర్థం ధర్మయాత్ర నిర్వహిస్తామని చెబుతున్నారు.

చలో రామతీర్థం కార్యక్రమానికి ఉత్తరాంధ్రలోని ప్రతీ మండలం నుంచి శ్రీరామ సేవకులు, ధార్మిక సంఘాల ప్రతినిధులు, జనసేన, బీజేపీ కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. ఈ యాత్రకు 40కి పైగా ధార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. వరుసగా ఆలయాలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం అయిందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఇక సంహించే ప్రసక్తే లేదని.. అందుకే రామతీర్థంలోనే తేల్చుకుంటామని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే, బీజేపీ, జనసేన చేపట్టిన యాత్రపై మొదట ఉత్కంఠ కొనసాగింది. చివరకు పోలీసుల నుండి అనుమతి లభించడంతో నీలాచలం కొండపై చేపట్టే నిరసనను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తానికి రామతీర్థంలో రాజుకున్న వేడి రాజకీయ వర్గాల్లో మంటలు పుట్టిస్తోంది. ఇక చలో రామతీర్థం యాత్రతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.