గుజరాత్ స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాం: ఆప్

దేశ ప్రదాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు తమ తమ అభ్యర్థుల జాబితాను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. గుజరాత్‌లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు మొదటి విడత జాబితాగా 504 అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. గుజరాత్‌తో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతుందని ఆప్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు ఆప్ ఢిల్లీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిథి అతిషి గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు.. శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లోనూ ఆప్ పోటీ చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

ఇదే సమయంలో అతిషి బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆకర్షించడం.. లేదంటే బెదిరించడం.. ఇదే బీజేపీ రాజకీయాలు అని విమర్శించారు. గుజరాత్‌లో బీజేపీని సమర్థంగా ఎదుర్కొంటామని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి తీరుతామని అతిషి ధీమా వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీకి భయపడని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేజ్రీవాల్ మాత్రమే అని పేర్కొన్నారు. భయం అంటే ఎరుగని కేజ్రీవాల్ సైనికులం తాము అని, సత్యం కోసం పోరాటం సాగిస్తామని చెప్పుకొచ్చారు.