జమ్ములో భారీగా కురుస్తోన్న మంచు.. 3 వేలకుపైగా వాహనాల నిలిపివేత

జమ్ముకశ్మీర్‌లోని జమ్ము, శ్రీనగర్‌ మధ్య గల జాతీయ రహదారిపై భారీగా మంచు కురుస్తుండటంతో జమ్ము, శ్రీనగర్‌ జాతీయ రహదారిపై అధికారులు రాకపోకలను నిలిపివేశారు. జవహర్‌ టన్నెల్‌, రాంబన్‌లోని బానిహాల్‌ సమీపంలో రహదారిపై విపరీతమైన మంచుకురుస్తుండడంతో జవహర్‌ టన్నెల్‌తో పాటు జాతీయ రహదారిపై వాహనాలను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు.

ఈ కారణంగా రహదారిపై ఏకంగా మూడు వేలకుపైగా వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. రోడ్లపై పెద్ద ఎత్తున పేరుకుపోయిన మంచును తొలిగించే పనిలో పడ్డారు అధికారులు. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా భారీగా మంచు కురుస్తుండడంతో జమ్ము, కశ్మీర్‌లను కలిపే మొగల్‌ రోడ్డును మూసివేశారు. భారీ హిమపాతం కారణంగా రోడ్లపై 2 నుంచి 3 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. కశ్మీర్‌ లోయలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. శ్రీనగర్‌లో సోమవారం అత్యల్పంగా 0.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఆదివారం ఏకంగా -1.5 డిగ్రీలో ఉష్ణోగ్రత రికార్డైంది. ఇక భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్‌ నుంచి విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.