ప్రియాంకాగాంధీకి బీజేపీ నాయకురాలు మద్దతు.. నోయిడా పోలీసుల క్షమాపణలు

హథ్రాస్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ప్రియాంకాగాంధీ కుర్తా పట్టుకుని లాగిన గౌతమ్‌బుద్ధనగర్ పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర బీజేపీ నాయకురాలు చిత్ర వాఘ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను డిమాండ్ చేశారు. మహిళా రాజకీయ నాయకురాలిపై చేయి వేయడానికి ఆ మగ పోలీస్ అధికారికి ఎంత ధైర్యమని చిత్ర మండిపడ్డారు. పోలీసులు వారి పరిమితులు ఎరిగి నడుచుకోవాలని ఆమె ట్వీట్ చేశారు.

భారతీయ సంస్కృతిపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. పరిమితులు దాటి వ్యవహరించే ఇలాంటి పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్ర వాఘ్ ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. ఆ ట్వీట్‌తోపాటు పోలీస్ అధికారి ప్రియాంకాగాంధీ కుర్తా లాగుతున్నట్లుగా ఉన్న ఫొటోను కూడా ఆమె పోస్ట్‌చేశారు. కాగా, ప్రియాంకాగాంధీకి మద్దతుగా చిత్రవాఘ్ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఏడాది క్రితం బీజేపీలో చేరినా చిత్ర సంస్కారానికి కట్టుబడి ఉన్నారని ప్రశంసించింది.

కాగా, ఈ ఘటనలో ప్రియాంక గాంధీ పట్ల దురుసుగా ప్రవర్తించడంపై గౌతమ్‌బుద్ధానగర్‌ (నోయిడా) పోలీసులు క్షమాపణ చెప్పారు. డిఎన్‌డి ఫ్లైఓవర్‌ వద్ద జరిగిన హైడ్రామా సమయంలో ప్రియాంక కుర్తా పట్టుకున్న అధికారిపై విచారణ చేపడుతున్నామని తెలిపారు.