చెరువులు, ప్రభుత్వ స్థలాలకు సరిహద్దులు నిర్ణయించాలి

  • కబ్జాదారులపై తగు చర్యలు చేపట్టాలి
  • తక్షణమే ఆక్రమణలు తొలగించాలి
  • సంబంధిత రెవెన్యూ అధికారులు సిబ్బందిపై కూడా చర్యలు చేపట్టాలి
  • జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: 1905లో జరిగిన డయోగ్లైట్ గ్రామాల రికార్డుల ప్రకారం, 1956లో జరిగిన రీ సర్వే సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్ అనుసరించి ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి వనరుల సరిహద్దులను నిర్ణయించి ప్రస్తుతం రీ సర్వే చేయాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు ఖాతా విశ్వేశ్వరరావు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, గుండ్రెడ్డి గౌరీ శంకర్, కొల్లి వెంకటరావు, శంకరపు రాకేష్, గున్నాన వినాయకుమార్, పైలా రాజు తదితరులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను కలిసి జిల్లాలోని ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డలు తదితర నీటి వనరులు కబ్జాలు, ఆక్రమణలు తదితర వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రీ సర్వేను 1905లో జరిగిన డయోగ్లైట్ గ్రామాల రికార్డుల ప్రకారము, 1956లో జరిగిన రీ సర్వే సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్ రికార్డులను అనుసరించి ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, గెడ్డలు తదితర నీటి వనరులు, పోరంబోకు స్థలాలను గుర్తించి, ప్రభుత్వ మిగులు భూములు, రోడ్లు, కాలువలు, కొండలు, గ్రామ కంటాలు, స్మశానాలు, అన్యాక్రాంతం కాకుండా కాపాడి వాటికి సరిహద్దులు నిర్ణయించి, అప్పుడు రిసర్వ్ చేయాలని కోరారు. అంతేగాని అన్యాక్రాంతం కాగా మిగిలిన వాటికి ఇప్పుడు రీ సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించడం సరికాదు అన్నారు. ఇప్పటికే జిల్లాలో ఆయా చెరువులు, నీటి వనరులు, ప్రభుత్వ భూములు కొంతమేరకు ఆక్రమణకు గురయ్యాయన్నారు. కాబట్టి తక్షణమే ఆక్రమణ తొలగించాలన్నారు. ఆక్రమించిన స్థలాల్లో చేపట్టిన భవనాలను తొలగించాలని, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నీటి వనరులు ఆక్రమణ జరిగిన సమయంలో అక్కడ పనిచేసే రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, సచివాలయ సిబ్బంది అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ చర్యలపై సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.