కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలి: ప్రధాని మోడీ

నీతి ఆయోగ్‌ పాలకమండలి భేటీలో మోదీ

న్యూఢిల్లీ : కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేసినప్పుడే సహకార సమాఖ్య మరింత బలోపేతమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ స్ప ష్టం చేశారు. శనివారం నీతి ఆయోగ్ ఆరో పాలక మండలి సమావేశం జరిగింది. వీడియో కాన్పరెన్స్ ద్వారా మోడీ వివిధ రాష్ట్రాల సిఎంలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రాల పనితీరుపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. సహకార సమాఖ్య విధానాన్ని జిల్లా స్థాయిల్లోనూ బలోపేతం చేయాలని ఆయన సిఎంలకు సూచించారు. కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయడం వల్లనే ఆ మహమ్మారిని ఎదుర్కోగలిగామని మోడీ చెప్పారు. కరోనా కట్టడిలో ప్రపంచ దేశాలు భారత్ ను కొనియాడాయని ఆయన తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిందని, నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుందని ఆయన చెప్పారు. కరోనా టీకాల ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని, ప్రజలకు ఉచితంగా బ్యాంకు ఖాతాలు కల్పిస్తున్నామని , వైద్య సదుపాయాలు కూడా పెరిగాయని, నిరుపేదలకు ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.