అంతరిక్ష రంగంలో సత్తా చాటిన చంద్రయాన్-3

• ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు
చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన శుభ సందర్భంలో ఈ మిషన్ లో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలందరికీ పేరుపేరునా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అంతరిక్షంలో విజయాలు సాధిస్తున్న కొద్ది దేశాల సరసన భారత్ ఏనాడో చేరినప్పటికీ చంద్రయాన్ వంటి ప్రయోగం కారణంగా అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రరాజ్యంగా ఆవిర్భవించడం భరత జాతి అంతటికీ గర్వకారణం. ఎంతో సంక్లిష్టమైన ఇటువంటి ప్రయోగానికి కేవలం అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలే ప్రయత్నించాయి. ఇప్పుడు భారత దేశం కూడా చంద్రునిపై ప్రయోగాలు చేస్తున్న దేశంగా పేర్గాంచింది. చంద్రయాన్-1 ప్రయోగించినప్పుడే భారత్ సాధించిన అంతరిక్ష సాంకేతిక ప్రగతికి ప్రపంచ దేశాలు ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యాయి. ఇప్పుడు చంద్రయాన్-3 ప్రయోగంతో భారత్ సత్తా ప్రపంచానికి మరోసారి చాటి చెప్పినట్లయ్యింది. అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాల విపణిలో భారత్ కు ఈ ప్రయోగం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు వ్యాఖ్యానించడం ఆశాజనక పరిణామం. ఈ ప్రయోగం మిగిలిన దశలలో కూడా మన శాస్త్రవేత్తలు విజయ సాధిస్తారని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతరిక్ష ప్రయోగాలకు వెనక ఉండి నడిపిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ మోదీ గారికి, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి నా అభినందనలు తెలియచేసుకుంటున్నాను. అతి సంక్లిష్టమైన ఈ ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన మన శాస్త్రవేత్తలకు భవిష్యత్తులో మార్స్, జూపిటర్ వంటి గ్రహాలకు సైతం ల్యాండర్స్ ను పంపటం కష్టతరం కాదు. అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మరిన్ని విజయాలు సాధించాలని నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన కోరుకుంటున్నానని జనసేనాని పేర్కొన్నారు.