వచ్చే ఏడాదికి చంద్రయాన్-3 వాయిదా: ఇస్రో చైర్మన్‌ శివన్‌

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం ఇతర అన్ని కార్యకలాపాలతో పాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రాజెక్టులపై కూడా పడింది. దీంతో పలు ప్రయోగాలకు అనుకున్న షెడ్యూల్‌ వాయిదా పడుతోంది. తాజాగా గతేడాది చివరిలో చేపట్టాలని అనుకున్న చంద్రయాన్‌-3 యాత్రను వచ్చే ఏడాదిలో నిర్వహించే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ పేర్కొన్నారు. చంద్రుడిపైకి భారత చేస్తున్న మూడో యాత్ర చంద్రయాన్‌-3 కావడం గమనార్హం. వాయిదా పడిన ప్రయోగాల్లో దేశంలోనే మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ కూడా ఉంది. చంద్రయాన్‌-3ను 2022లో ప్రయోగించేందుకు తాము సన్నద్ధమౌతున్నామని శివన్‌ చెప్పారు. అయితే చంద్రయాన్‌-2 సమయంలో ప్రయోగించిన ఆర్బిటర్‌నే చంద్రయాన్‌-3కు కూడా వినియోగిస్తామని, తాజా ప్రయోగంలో ప్రత్యేకంగా ఆర్బిటర్‌ ఉండదని తెలిపారు. లూనార్‌ సౌత్‌ పోల్‌పై రోవర్‌ను ల్యాండ్‌ చేయాలనే లక్ష్యంతో ఇస్రో శాస్త్రవేత్తలు 2019, జులై 22న చంద్రయాన్‌-2ను అత్యంత శక్తివంతమైన జియోసింక్రనస్‌ లాంచ్‌ వెహికల్‌ ద్వారా ప్రయోగించింది. దీని ద్వారా ల్యాండర్‌ విక్రమ్‌ అదే సంవత్సరం సెప్టెంబర్‌ 7న లూనార్‌ ఉపరితలంపై హార్డ్‌ ల్యాండయిన విషయం తెలిసిందే. దీంతో మొదటి ప్రయత్నంలోనే లూనార్‌ ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్‌ అవ్వాలన్న భారత్‌ కల నెరవేరలేదు.