వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం లభించింది. ఆదివారం మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ వైదొలగిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించిన అకాలీదళ్.. నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన హర్ సిమ్రత్ కౌర్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. గతంలో అటు పంజాబ్ రాష్ట్రంలోనూ.. ఇటు కేంద్రంలోనూ ఈ రెండు పార్టీలు అధికారాన్ని పంచుకున్నాయి.

రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆ బిల్లులను తాము సమర్థించలేమని అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను విపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటులో ప్రవేశపెట్టగా, ఆమోదం పొందాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదంతో చట్ట రూపంగా మారాయి.

కాగా, సెప్టెంబర్ 25న దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల రైతు సంఘాలు, విపక్ష పార్టీల నాయకులు, కార్యర్తలు రోడ్లపైకి వచ్చి ఈ బిల్లులకు నిరసన తెలిపారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ నిరసనలు ఎక్కువగా జరిగాయి. రోడ్లు, రైల్వే ట్రాక్స్ వద్ద ఆందోళనలు నిర్వహించారు.