ఐపీఎల్ 2020 : చెన్నై విజయం.. ప్లేఆఫ్ పై‌ ఆశలు సజీవం

ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో చెన్నై అదరగొట్టింది. హైదరాబాద్‌పై గెలిచి ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది. దుబాయ్‌ వేదికగా వార్నర్‌ సేనతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై ఆరు వికెట్లకు 167 పరుగులు చేసింది. షేన్‌ వాట్సన్ (42; 38 బంతుల్లో, 1×4, 3×6), అంబటి రాయుడు (41*, 34 బంతుల్లో, 3×4, 2×6) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. విలియమ్సన్‌ (57; 39 బంతుల్లో, 7×4) పోరాడాడు. ఛేదన ఆరంభించిన హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. వార్నర్‌ (9; 13 బంతుల్లో)ను సామ్‌ కరన్‌ ఔట్‌ చేయగా, మనీష్‌ పాండే (4; 3 బంతుల్లో, 1×4) రనౌటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన విలియమ్సన్‌.. బెయిర్‌స్టో (23; 24 బంతుల్లో, 2×4)తో కలిసి మరోవికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. అయితే బెయిర్‌స్టోను జడేజా బౌల్ట్‌చేసి ఆ జట్టును దెబ్బతీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ప్రియమ్‌ గార్గ్‌ (16; 18 బంతుల్లో, 1×4), విజయ్‌ శంకర్‌ (12; 7 బంతుల్లో, 1×6) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. మరోవైపు విలియమ్సన్‌ తన పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో అర్ధశతకం బాదాడు. అయితే తర్వాతి ఓవర్‌లోనే విలియమ్సన్‌ ఔటవ్వడంతో హైదరాబాద్‌ ఓటమి ఖరారైంది. రషీద్‌ ఖాన్‌ (14; 7 బంతుల్లో, 1×4, 1×6) సాధించిన పరుగులు ఓటమి అంతరాన్ని తగ్గించాయి. చెన్నై బౌలర్లలో బ్రావో, కర్ణ్‌ శర్మ రెండు వికెట్లు, జడేజా, సామ్‌కరన్, శార్దూల్ తలో వికెట్ తీశారు.