ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు

కరోనా వ్యాప్తి కారణంగా స్కూళ్లు మూతపడడంతో ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు టీచర్ల వెతలపై సీఎం కేసీఆర్ ఉదారంగా స్పందించారు. తెలంగాణలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి నెలకు రూ.2 వేల సాయం అందిస్తామని ప్రకటించారు. టీచర్లు, సిబ్బంది కుటుంబాలకు నెలకు 25 కిలోల బియ్యం ఇవ్వనున్నట్టు కూడా తెలిపారు.

 సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 1.45 లక్షల మంది ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి లబ్ది చేకూరనుంది. దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కరోనా దృష్ట్యా ప్రైవేటు టీచర్లు, సిబ్బందిని ఆదుకోవాలనే సాయం చేస్తున్నామని చెప్పారు. టీచర్లు, సిబ్బంది తమ జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.