కుప్పకూలిన నౌకాదళ గ్లైడర్

భారత నావికదళానికి చెందిన ఓ శిక్షణ విమానం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు నేవీ అధికారులు మరణించారు. ఈ దుర్ఘటన కేరళ రాష్ట్రం కొచ్చి నావికాదళానికి సమీపంలో ఉన్న తొప్పంపాడి వంతెన సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. రోజువారీ శిక్షణలో భాగంగా కొచిలోని నావల్‌ ఎయిర్‌ స్టేషన్‌ ‘ఐఎన్‌ఎస్‌ గరుడ’ నుంచి ఆదివారం ఉదయం నింగిలోకి ఎగిరిన పవర్ గ్లైడర్.. 7 గంటల ప్రాంతంలో నౌకాదళ స్థావరానికి సమీపంలోని తొప్పుంపాడీ వంతెన వద్ద కూలిపోయింది. అందులో ఉన్న పైలట్‌, లెఫ్టినెంట్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ ఝా (39), ఆఫీసర్‌ సునీల్‌ కుమార్‌ (29) దుర్మరణం పాలయ్యారు.

ఈ ప్రమాద ఘటనపై నౌకాదళ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రాజీవ్ ఝా ఉత్తరాఖండ్‌కు చెందినవారు కాగా.. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సునీల్ కుమార్ స్వస్థలం బీహార్ కాగా.. ఆయనకు ఇంకా వివాహం కాలేదు. యుక్త వయస్సులోనే అధికారులిద్దరూ మరణించడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.