‘వంద కోట్ల’ వ్యాక్సినేషన్‌తో కొత్త ఉత్సాహం

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా 100 కోట్ల డోసుల పంపిణీ విజయవంతం కావడానికి ప్రధాన కారణం మన ఆరోగ్య కార్యకర్తలేననీ, వారు సరికొత్త ఉదాహరణను అందించారని ప్రధాని మోడీ అన్నారు. మన్‌కీబాత్‌ కార్యక్రమం ద్వారా ప్రధాని తాజాగా రేడియో ప్రసంగం చేశారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్‌ వైపు చూస్తోందని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుండటంతో ప్రపంచ దేశాల ముందు భారత్‌ తన శక్తి సామర్థ్యాలు, సత్తాను ప్రదర్శిస్తున్నదని అన్నారు. దేశ ప్రజలందరికీ కరోనా టీకాలు అందించే కార్యక్రమంలో దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదని కొనియాడారు. మన ఆరోగ్య కార్యకర్తలు వారి నిర్విరామ కృషి, ధృఢ సంకల్పంతో కొత్త ఉదాహరణను దేశానికి అందించారని అన్నారు. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌కు చెందిన మహిళా ఆరోగ్య కార్యకర్త పూనం నౌటియాల్‌తో ప్రధాని మాట్లాడారు. టీకా సమయంలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. మనమంతా ఐక్యంగా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని, సంస్కృతి, మూలాల గురించి గర్వపడేలా బిర్సా ముండా మనకు నేర్పించారని కొనియాడారు. అలాగే, పోలీసు, భద్రతా దళాల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం చాలా సంతోషకరమైన విషయం అని ప్రధాని మోడీ అన్నారు. సర్దార్‌ వల్లభ్‌ భారు మనకు ఐక్యత సందేశాన్ని అందించారని పేర్కొన్నారు.