ఏపి లో ప్రారంబం కానున్నకళాశాలలు

రాష్ట్రంలోని ఉన్నత విద్య విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి  పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

రాష్ట్రంలోని కళాశాలలను అక్టోబరు 15నుంచి ప్రారంభించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(సెట్స్‌) సెప్టెంబరులో నిర్వహించాలన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న దాదాపు 1,110  అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో(జీఈఆర్‌)ను పెంచే దిశగా పనిచెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన ద్వారా పెద్ద చదువులకు అండగా నిలుస్తున్నామని, అందువల్ల జీఈఆర్‌ కచ్చితంగా పెరగాలన్నారు. మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటి్‌సషిప్‌ చేర్చినట్లు తెలిపారు. దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ ఉంటుందని, దాన్ని డిగ్రీ ఆనర్స్‌గా పరిగణిస్తామన్నారు. అదనంగా ఏడాది అనేది విద్యార్థి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. బీటెక్‌కు సంబంధించి 4ఏళ్లలో కూడా తప్పనిసరి అప్రెంటి్‌సషిప్‌ ఉంటుందన్నారు. అదనంగా 20 అడిషనల్‌ క్రెడిట్స్‌ సాధించేవారికి కూడా ఆనర్స్‌ డిగ్రీ ఇవ్వాలని, అడ్మిషన్ల సమయంలోనే సాధారణ డిగ్రీ, ఆనర్స్‌ డిగ్రీపై ఐచ్ఛికాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యా విధానంలో మార్పులు రావాలని, మంచి పాఠ్యప్రణాళికతో డిగ్రీలకు విలువ ఉంటుందన్నారు.

విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్న ముఖ్యమంత్రి అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.