కరోనా మృతులకు పరిహారం ఇవ్వాల్సిందే.. సుప్రీం కీలక ఆదేశాలు

కరోనా మృతుల పరిహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ తో చనిపోయారని తేలితే కచ్చితంగా పరిహరం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అది.. డెత్ సర్టిఫికెట్లలో లేకపోయినా సరే అమలు చేయాలని ఆదేశించింది. కోవిడ్ తో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు పరిహారం ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

కరోనా మృతులకు చెల్లించే ఎక్స్ గ్రేషియా… ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సాయానికి అదనంగానే ఉండాలని తెలిపింది సుప్రీం. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బోపన్నతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా మరణంపై కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి సరైన వివరాలు చెప్తే.. రూ.50వేల వరిహారం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇవ్వాలని తెలిపింది.

రోగి ఇంటి దగ్గర చనిపోయాడా లేక ఆస్పత్రిలో చనిపోయాడా అన్నది కూడా చూడాల్సిన అవసరం లేదని చెప్పింది సుప్రీంకోర్టు. కరోనా మృతులుగా నిర్దారించిన తర్వాత దరఖాస్తు అందిన 30 రోజుల్లోగా రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి కుటుంబ సభ్యులకు రూ.50 వేల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.