డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరం.. యూఎస్ సిద్ధంగా ఉండాలన్న డాక్టర్ ఆంటోనీ ఫౌసీ!

కరోనా మహమ్మారిపై అమెరికా చేస్తున్న పోరాటానికి డెల్టా వేరియంట్ తీవ్రమైన విఘాతం కలిగించే ప్రమాదం ఉందని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్ డాక్టర్ ఆంటోనీ ఫౌసీ హెచ్చరించారు. ప్రస్తుతం వెలుగుచూస్తున్న డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని, ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ వేరియంట్ తొలుత ఇండియాలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇది సోకితే ప్రాణాలు పోయే ప్రమాదం అధికం.

ఏడాదిన్నర నాడు వెలుగులోకి వచ్చి, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కరోనా, ఆపై వచ్చిన పలు రకాల వేరియంట్లతో పోలిస్తే, ఇది భిన్నమైనదని వైట్ హౌస్ కొవిడ్-19 రెస్పాన్స్ టీమ్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.ప్రస్తుతం అమెరికాలో వెలుగు చూస్తున్న కొత్త కరోనా కేసుల్లో 20 శాతం డెల్టా వేరియంట్ వేనని వెల్లడించిన ఆయన, రెండు వారాల క్రితం ఇవి 10 శాతం ఉండేవని, 15 రోజుల వ్యవధిలోనే డెల్టా వేరియంట్ కేసులు రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

యూకేలో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్ మాదిరిగానే ఇది కూడా ప్రాణాంతకమేనని, దీనిపై ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని ఆయన అన్నారు.ఇదే సమయంలో ఆయన ఓ శుభవార్తను కూడా చెప్పారు. అమెరికాలో తయారవుతున్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయని అన్నారు. “మన వద్ద ఆయుధాలు ఉన్నాయి. వాటితో వచ్చే సమస్యను ఎదుర్కోవాల్సి వుంది. ఆల్ఫా వేరియంట్ కేసుల కన్నా, డెల్టా వేరియంట్ కేసులే అధికంగా ఉన్నాయి. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి” అని ఫౌసీ వ్యాఖ్యానించారు.