ఏపీలో ప్రారంభమైన పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సుమారు 2,44,71,002 మంది గ్రామీణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

సమస్యాత్మక ప్రాంతాల్లో 47.03% పోలింగ్‌ కేంద్రాలు

పరిషత్‌ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 27,751 పోలింగ్‌ కేంద్రాల్లో 6,492 సమస్యాత్మక, 6,314 అత్యంత సమస్యాత్మక, 247 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ 47.03% పోలింగ్‌ కేంద్రాల్లోనూ గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఏజెన్సీ మండలాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్‌ నిలిపివేసి బ్యాలెట్‌ బాక్సులను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. 1,72,787 మంది పోలింగ్‌ సిబ్బంది సేవలు అందించనున్నారు. పోలింగ్‌ పర్యవేక్షణ కోసం 1,972 మంది జోనల్‌ అధికారులు, 6,524 మంది సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేశారు.

పోలింగ్‌ కేంద్రాల్లో విధిగా కొవిడ్‌ నిబంధనలు అమలు చేయనున్నారు.

ఓటర్లు మాస్క్‌ పెట్టుకొని భౌతిక దూరం పాటించాలి.

థర్మల్‌ స్కానింగ్‌ తరువాతే పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన ఓటర్లకు అవసరమైనచోట పీపీఈ కిట్లు అందిస్తారు. వారికి పోలింగ్‌ చివరి గంటలో ఓటేయడానికి అనుమతిస్తారు.