జూన్ నాటికి కొవాక్సిన్ ఉత్పత్తి రెండింతలు: హర్షవర్ధన్

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఉత్పత్తిని ముమ్మరంగా చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. కొవాక్సిన్ ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం జూన్ నాటికి రెండింతలవుతుందని, జులై-ఆగస్ట్ నాటికి ఆరేడు రెట్లు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సెప్టెంబర్ నాటికి భారత్ బయోటెక్ ప్రతినెలా 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేసే స్థాయికి చేరుతుందని పేర్కొన్నారు.

డాక్టర్ హర్షవర్ధన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ, హర్యానా, పంజాబ్, బిహార్, జార్ఖండ్, ఒడిషా, జమ్ము కశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రులతో సమావేశమయ్యారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వ రంగ తయారీదారుల వద్ద మౌలిక సౌకర్యాలను అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. భారత్ బయోటెక్ బెంగళూర్ కేంద్రంలో సామర్ధ్య పెంపు కోసం రూ 65 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు వెల్లడించారు. ముంబైలోని మహారాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని హాఫ్కైన్ ఇనిస్టిట్యూట్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ల ఉత్పత్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.