క్రేజీ ఆరోపణలు: బిల్ గేట్స్

కోవిడ్ మహమ్మారికి తానే కారణమంటూ సోషల్ మీడియాలో వ్యాప్తిస్తున్న వదంతలను మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కొట్టిపారేశారు. ఆ ఆరోపణలు కుట్ర పూరితంగా, క్రేజీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రైటర్స్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆ ఆరోపణల వెనుక ఉన్న కారణాలను అన్వేషిస్తామన్నారు. ఏడాది క్రితం చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ కేసులు బయటపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇంటర్నెట్‌లో కుట్రపూరిత ప్రచారాలు సాగాయి. వైరస్ ఎక్కడ, ఎందుకు, ఎలా పుట్టిందని, దానికి కారణం ఎవరన్న అంశంలో వదంతులు వ్యాపించాయి. దిగ్గజ వ్యాపారవేత్త బిల్ గేట్స్ విచ్చలవిడిగా ఫండింగ్ చేయడం వల్లే కొందరు వైరస్‌ను పుట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజలను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు వైరస్‌ను సృష్టించారని, దాని కోసం అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, బిల్ గేట్స్ ప్లాన్ వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైరస్ సోకిన వారి నుంచి లబ్ధి పొందేందుకు వారు ఆ పని చేశారని ఫిర్యాదులున్నాయి. వ్యాక్సిన్ల ద్వారా మైక్రోచిప్‌లను ఇన్‌సర్ట్ చేసేందుకు గేట్స్ కుట్ర పన్నినట్లు ఆన్‌లైన్‌లో ప్రచారం సాగింది. అయితే ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని గేట్స్ తేల్చారు. సంపన్న దేశాలతో పోలిస్తే పేద దేశాలకు కోవిడ్ టీకాలు 8 నెలలు ఆలస్యంగా అందనున్నట్లు బిల్ గేట్స్ అంచనా వేస్తున్నారు.