దిల్లీ పేలుడు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగించిన కేంద్రం

దేశ రాజధాని దిల్లీలో జనవరి 29న జరిగిన బాంబు పేలుడు ఘటనను ఇకపై ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది. దిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో ఐఈడీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్రం ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇద్దరు అనుమానితులను కూడా గుర్తించారు. ”ఇజ్రాయెల్‌ ఎంబసీ సమీపంలో జరిగిన పేలుడు ఘటన దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించాం.” అని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ ఘటన దర్యాప్తును జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ పేలుడు వెనుక ఎవరున్నారన్నది ఇంకా తెలియరాలేదని కేంద్రం తెలిపింది.