కాలుష్యం కోరల్లో దిల్లీ.. విద్యాసంస్థల మూసివేత!

దేశ రాజధాని నగరంలో కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరడంతో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది.

అలాగే, అత్యవసర సేవల వాహనాలు మినహా బయటి నుంచి వచ్చే వాహనాల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్టు పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. సంబంధిత శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ను పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆదివారం వరకు నిర్మాణ, కూల్చివేతల కార్యక్రమాలపైనా నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మొత్తంగా 1000 ప్రైవేటు సీఎన్‌జీ బస్సులను అద్దెకు తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియ గురువారం ప్రారంభంకానుందన్నారు. వాయు కాలుష్యం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుండగా.. దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌) పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలన్నింటినీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు మూసివేయాలని వాయు నాణ్యతా మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. కేవలం ఆన్‌లైన్‌ తరగతులను మాత్రమే నిర్వహించాలని సూచించింది.

ప్రజా రవాణాను వినియోగించండి: కేంద్రం
వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ వీలైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, కొవిడ్‌ నిబంధనలను తప్పక పాటించాలని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ ప్రజలను హెచ్చరించింది. ఉద్యోగులు ఎవరైనా ప్రైవేట్‌- ప్రభుత్వ వాహనాలు ఉపయోగిస్తున్నట్లైతే.. రోడ్డుపై వాహనాల సంఖ్యను తగ్గించేందుకు వారంతా కచ్చితంగా ప్రజా రవాణాను ఉపయోగించాలని కోరింది.