‘అభివృద్ధి – అందరికీ సంక్షేమం’ మన నినాదం

• రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ ఎన్నికలు
• ఐదేళ్లలో రంగులు వేయడం మినహా ప్రభుత్వం చేసింది లేదు
• ప్రభుత్వ మోసాన్ని ప్రజల ముందు ఎండగట్టండి
• పండగ తర్వాత పూర్తిగా ఎన్నికలపై దృష్టి
• తెనాలిలో క్రియాశీలక సభ్యుల సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

అభివృద్ధి – అందరికీ సంక్షేమం నినాదంతో ప్రజల వద్దకు వెళ్దామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రయోజనాల కోసమో కాదని, మన రాష్ట్రం కోసం అనే వాస్తవాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ప్రభుత్వ దుర్మార్గ చర్యలకు గ్రామ స్థాయి నుంచి ఎదురు నిలబడాలని పిలుపునిచ్చారు. రెండు నెలలపాటు కష్టపడితే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. శనివారం సాయంత్రం తెనాలి నియోజకవర్గం, సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యులు, నాయకులతో సమావేశం అయ్యారు. సార్వత్రిక ఎన్నికల కార్యచరణ, సన్నద్ధత పై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రజల కోసం జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి విధానాలు ప్రతి ఒక్కరికీ వివరించాలి. ఒక్కొక్కరు కనీసం పది మందిని ప్రభావితం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. గడచిన ఐదేళ్లలో కనబడిన చోటల్లా రంగులు పూయడం మినహా చేసిన అభివృద్ది లేదు. ప్రతి నెలా పెరగాల్సిన ఫించన్లు తగ్గుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల వద్ద ఎండగట్టాలి. వైసీపీ పాలనలో ప్రతి నెలా ఫించన్లు కోతపెడుతూ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు. ఇన్సూరెన్స్ కట్టకుండా రైతుల్ని నష్టపరిచారు. మహిళలను ఇబ్బందిపెడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజలకు తెలియచేయాలి. ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కలసి ముందుకు వెళ్దాం. అన్ని వర్గాల ప్రజలను కలసి వారి సమస్యలు తెలుసుకుని వారికి భరోసా ఇద్దాం. పండగ వరకు గ్రామ స్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి, పండగ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల సన్నద్దతకు సిద్ధం అవుదాం. కొత్తగా నమోదైన ఓట్ల మీద దృష్టి సారించండి. మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లండి” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బండారు రవికాంత్, శ్రీ హరిదాసు గౌరీశంకర్, శ్రీ దివ్వెల మధుబాబు, శ్రీ పసుపులేటి మురళీకృష్ణ, ఎంపీటీసీ శ్రీమతి పసుపులేటి వెంకటనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.