వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీపావళి సందర్భంగా అమెరికాలోని భారతీయులతో కలసి వేడుకలో ట్రంప్ పాలు పంచుకున్నారు. ట్రంప్ స్వయంగా దీపం వెలిగించి భారతీయులకు.. భారతీయ అమెరికన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయుల ప్రముఖ పండుగ అయిన దీపావళిని వైట్ హౌస్ లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అక్కడి భారతీయ అమెరికన్లు అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. దీపావళి పండుగ జరుపుకుంటున్న ప్రతిఒక్కరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన ఆధ్యాత్మిక విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటామని అన్నారు. ఇళ్లు, కార్యాలయాలు, దేవాలయాల్లో దీపాలు వెలుగుతున్నప్పుడు వాటి వెచ్చదనం మన జీవితాల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని, భక్తి, సాంప్రదాయాలను గుర్తుచేస్తాయని వెల్లడించారు. అమెరికా చాలా నమ్మకమైన దేశం, ప్రతిఒక్క అమెరికన్ రాజ్యాంగ బద్ధంగా జీవించేందుకు తమ పరిపాలన కృషిచేస్తుందని ట్వీట్ చేశారు. తాను దీపావళిలో పాల్గొన్న ఫోటోలను ట్విట్టర్ లో కూడా షేర్ చేశారు ట్రంప్.